పెరిగిన జీఎస్డీపీ వృద్ధిరేటు

సంపదలో తెలంగాణ ఉరుకులు పెడుతున్నది. జీఎస్డీపీ వృద్ధిరేటు కొనసాగుతున్నది. ఈసారి కూడా రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగిందని అర్థగణాంక శాఖ.. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ తాజాగా వెల్లడించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రస్తుత ధరల వద్ద 14.8 శాతం.. స్థిర ధరల వద్ద 10.5శాతం వృద్ధిరేటును నమోదు చేసుకున్నట్లు తెలిపింది. అన్ని రంగాలలో స్థిరమైన వృద్ధిరేటుతో రాష్ట్రం.. జాతీయ సగటుకంటే ఎంతో ముందంజలో ఉన్నది. దేశంలో అగ్రభాగాన నిలుస్తున్నది. స్థిర ధరల్లో వృద్ధిరేటు జాతీయ సగటుకు రెట్టింపుగా ఉంది. తాజా లెక్కల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో వివిధరంగాల్లో రాష్ట్రం మొత్తం సంపద ప్రస్తుత ధరల వద్ద రూ.8,66,688 కోట్లకు పెరిగింది. 2014-15లో 12 శాతం ఉన్న జీఎస్డీపీ వృద్ధిరేటు.. 2015-16లో 14.2కు పెరిగింది. 2016-17లో 14.2 శాతం కొనసాగగా 2017-18లో 14.3శాతానికి, ఈసారి 14.8 శాతానికి పెరిగింది. ఒక రాష్ట్రం అభివృద్ధికి జీఎస్డీపీనే ప్రధాన ప్రాతిపదికగా పరిగణిస్తారు. దానిని అనుసరించే రెవెన్యూ రాబడులు, ఖర్చులు, పెట్టుబడి వ్యయం అన్నింటిని అంచనా వేస్తారు. ప్రాథమికరంగమైన వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 10.9శాతం, ద్వితీయశ్రేణి రంగాలైన పరిశ్రమలు, విద్యుత్‌ ఉత్పత్తి, నిర్మాణరంగంలో 14.9శాతం వృద్ధిరేటు నమోదు కాగా, సేవారంగంలో 19.8శాతం వృద్ధి రేటు నమోదయింది.

తాజా అంచనాల ప్రకారం రాష్ట్ర జీఎస్‌డీపీ ప్రస్తుత ధరల వద్ద 10.5శాతానికి పెరిగింది. అదే సమయంలో జాతీయస్థాయిలో జీడీపీ 6.8 శాతంగా ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర మొత్తం సంపద ప్రస్తుత ధరల వద్ద రూ.8,65,688 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే సమయానికి రూ.7,53,804 కోట్లుగా ఉన్న రాష్ట్ర సంపద.. అదనంగా లక్ష కోట్లకు పైగా పెరగడం విశేషం. రాష్ట్ర సంపద మొత్తం జాతీయ సంపదలో 4.43 శాతంగా ఉంది. ప్రస్తుత ధరల వద్ద జాతీయస్థాయిలో జీడీపీ రూ.1,90,53, 967కోట్లుగా ఉంటుందని 2018-19 ముందస్తు అంచనాల్లో వెల్లడయింది. తెలంగాణ సంపద వృద్ధిరేటు 15 శాతంగా ఉండగా జాతీయస్థాయిలో వృద్ధిరేటు 11.5శాతం మాత్రమే.

వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులు గణనీయంగా పెరగడం, కొత్త పరిశ్రమలు తరలిరావడం, వెల్లువలా పెట్టుబడులు రావడం, భవన నిర్మాణరంగంతో రియల్‌ మార్కెట్‌ పుంజుకోవడం, పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు ఉపాధి పెరగడం, సేవారంగాలలో పురోగమనం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సంపదను అంచనా వేశారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా అతి తక్కువ కాలంలో తెలంగాణ మాదిరిగా భారీస్థాయిలో వృద్ధిరేటును నమోదు చేసుకోలేదు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో స్ధిరమైన పాలన, పరుగులు తీస్తున్న అభివృద్ధి, ఉత్పాదకరంగాలకు ఊతం, నీటిపారుదల ప్రాజెక్టుల రంగంలో చోటుచేసుకున్న ప్రగతి.. వెరసి రాష్ట్ర సంపద పెరగడానికి దోహదపడింది.