ఆపిల్ నూతన ఫోన్ల ధరలు ఇవే

ఆపిల్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2019 ఐఫోన్లు విడుదలయ్యాయి. అధునాతన ఫీచర్లతో, ఆకట్టుకునే స్పెసిఫికేషన్లతో ఈసారి కొత్త ఐఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. యూఎస్‌ఏలోని ఆపిల్ ప్రధాన కార్యాలయంలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో జరిగిన ఆపిల్ ఈవెంట్‌లో ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ నూతన ఐఫోన్లను విడుదల చేశారు. ఐఫోన్ 11, 11ప్రొ, 11 మ్యాక్స్ పేరిట ఫోన్లు విడుదలయ్యాయి. వీటితోపాటు సెవెన్త్‌ జనరేషన్‌ ఐప్యాడ్ ను ఇంట్రడ్యూస్‌ చేశారు. అయితే దేశీయ మార్కెట్లో ఈ నెల 20 నుండి కొత్త ఐఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.

ఐఫోన్ 11లో 6.1 ఇంచుల ఎల్‌ ఆర్ డిస్‌ప్లేను ఏర్పాటు చేయగా.. 64,256, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను అందిస్తున్నారు. అలాగే ఈ ఫోన్ వెనుక భాగంలో ఒక్కోటి 12 మెగా పిక్సల్‌ కలిగిన రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందుభాగంలో 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఇక ఇందులో 4జీబీ ర్యామ్‌తోపాటు 3110 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. సౌండ్‌ క్లారిటీ కోసం మొదటిసారిగా డాల్బీ అట్మాస్ విధానాన్ని వినియోగించారు. గత ఏడాది వచ్చిన ఐఫోన్ల మాదిరిగానే ఈ సారి కూడా ఐఫోన్ 11లో డ్యుయల్ సిమ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. కాకపోతే అందులో ఒక్క స్లాట్‌లో మాత్రమే ఫిజికల్ సిమ్ వేసుకునేందుకు వీలుంటుంది. రెండో సిమ్‌ను ఇంతకుముందులాగే ఇ-సిమ్ రూపంలో వాడుకోవాలి. ఈ ఫోన్‌లో ఐఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఇక టచ్ ఐడీకి బదులుగా యూజర్లు ఇందులో ఫేస్ ఐడీతో ఫోన్‌ను లాక్/అన్‌లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అందరూ ఈ సారి ఐఫోన్లలో 5జీ ఫీచర్ వస్తుందని భావించారు. కానీ ఈసారికి మాత్రం ఈ ఐఫోన్లలో ఆపిల్ 4జీ ఫీచర్‌ను మాత్రమే అందిస్తోంది. ఐఫోన్ 11లో ఆపిల్ ఎ13 బయానిక్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఇది హెగ్జా కోర్ ను కలిగి ఉంటుంది. అందువల్ల గత ఐఫోన్ల కన్నా ఈ ఐఫోన్ మరింత వేగంగా పనిచేస్తుంది. దీంతోపాటు మల్టీమీడియా, గేమ్స్ కోసం అధునాతన ఫోర్ కోర్ గ్రాఫిక్స్ ఆపిల్ జీపీయూను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. దీంతోపాటు వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ తదితర ఇతర ఫీచర్లను కూడా ఐఫోన్ 11లో అందిస్తున్నారు.

Apple 11

గతేడాది విడుదలైన ఐఫోన్లలో ఆపిల్ ఎ12 బయానిక్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అయితే ఇప్పుడు విడుదలైన ఐఫోన్లలో ఉన్న ఎ13 బయానిక్ ప్రాసెసర్ గత ప్రాసెసర్ కన్నా మరింత వేగంగా పనిచేస్తుంది. ముఖ్యంగా అగ్‌మెంటెడ్ రియాలిటీ, ఏఐ యాప్స్ కోసం ఎ13 ప్రాసెసర్‌ను ఆపిల్ మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దింది. అందువల్ల ఈ ఐఫోన్ల ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది. స్మార్ట్‌ ఫోన్లలో అత్యంతవేగవంతమైన ప్రాసెసర్‌గా ఆపిల్ దీన్ని పేర్కొంది. ఇక గతేడాది విడుదలైన ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్‌లలో 4జీబీ ర్యామ్‌ను వినియోగించారు. కానీ ఈ సారి విడుదలైన ఐఫోన్ 11 ప్రొ, 11 ప్రొ మ్యాక్స్‌లలో ఏకంగా 6జీబీ ర్యామ్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ ఐఫోన్లు గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన పనితీరును ప్రదర్శించే వీలుంది.

Apple 11 pro

ప్రస్తుతం అనేక ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు 5జీ ఫోన్లను తయారు చేసే పనిలో పడ్డాయి. కొన్ని ఆ ఫోన్లను మరో 2, 3 నెలల్లో విడుదల చేయాలని చూస్తున్నాయి. దీంతో ఆపిల్ కూడా ఈసారి తన ఐఫోన్లలో టాప్ ఎండ్ మోడల్‌కు 5జీ సపోర్ట్‌ను అందిస్తారని అంతా భావించారు. కానీ ఈసారికి మాత్రం 5జీ ఫీచర్ ఇవ్వలేదు. 2020లో వచ్చే ఐఫోన్లలో 5జీ సౌలభ్యం ఉంటుందని తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం అనేక ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులో ఉన్న ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్‌ను కూడా ఆపిల్ తన నూతన ఐఫోన్లలో అందిస్తుందని అనుకున్నారు. కానీ ఆ ఫీచర్‌ను కూడా ప్రస్తుతానికి ఆపిల్ వాయిదా వేసింది. ఇక ప్రస్తుతం విడుదలైన కొత్త ఐఫోన్లను కూడా పాత పద్ధతిలోనే డిస్‌ప్లే పైభాగంలో నాచ్ ఉండే విధంగా డిజైన్ చేయడం విశేషం.

apple 11 pro max

ఐఫోన్ 11 ప్రొలో 5.8 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేయగా, 11 ప్రొ మ్యాక్స్‌లో 6.5 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వీటిల్లో 6జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్లు 128, 256, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తున్నాయి. ఈ ఫోన్ల వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న మూడు కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి టెలిఫోటో, వైడ్, అల్ట్రావైడ్ సామర్ధ్యాన్ని కలిగిఉన్నాయి. ఇక ఐఫోన్ 11 ప్రొలో 3190 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేయగా, 11 ప్రొ మ్యాక్స్‌లో 3500 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఇక మిగిలిన ఫీచర్లన్నీ ఐఫోన్ 11లోనివే వీటిల్లోనూ ఉన్నాయి. ఐఫోన్ 11 ప్రారంభ ధర 699 డాలర్లు ఉండగా, 11 ప్రొ ధర 999 డాలర్లు, 11 ప్రొ మ్యాక్స్ ధర 1099 డాలర్లుగా ఉంది. వీటిని భారత్‌లో, ఇతర దేశాల్లో ఈనెల 20 నుంచి విక్రయించనున్నారు. ప్రిఆర్డర్లు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఇండియాలో ధర ఎంతన్నది ఆపిల్ ఇంకా వెల్లడించలేదు. ఇక భారత్‌ సెప్టెంబర్‌ 27 నుంచి నూతన ఐఫోన్ల విక్రయాలు జరగనున్నాయి. ఐఫోన్‌ 11 ప్రొ ధర రూ.99,900లుగా, ఐఫోన్‌ ప్రో మ్యాక్స్‌ ధర రూ.1,09,900 ఉండనున్నట్లు ఆపిల్‌ వెల్లడించింది.

Apple Watch Series 5

ఆపిల్ ఈవెంట్‌లో భాగంగా సంస్థ తన వాచ్ పరంపరలో 5వ వాచ్‌ను విడుదల చేసింది. మొదటిసారిగా దీన్లో దిక్సూచిని కూడా పొందుపరిచింది. దీంతోపాటు అనూహ్యంగా ఒక ఐప్యాడ్‌ను పరిచయం చేసింది. 7వ తరం ఐప్యాడ్‌గా 10.2 అంగుళాల పరిమాణంలో రెటీనా డిస్‌ప్లేతో దీన్ని విడుదల చేశారు. ఆపిల్ వాచ్‌ సిరీస్‌ 5(జీపీఎస్‌) ధర రూ.40,900 నుంచి సిరీస్‌ 5(జీపీఎస్‌+సెల్యూలార్‌) ధర రూ.49,900 నుంచి ప్రారంభం కానుంది.