దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ

వెస్టిండీస్‌ పర్యటనలో మూడు సిరీస్‌లను క్లీన్‌ స్వీప్‌ చేసిన టీమిండియా మరో పోరుకు సిద్ధమవుతున్నది. చాల కాలం తర్వాత సొంతగడ్డ పై దక్షిణాఫ్రికాతో  సిరీస్‌కు కోహ్లీ సేన రెడీ అవుతున్నది.  ఇప్పటికే టీట్వంటీ సిరీస్‌కు టీమిండియాను ఎంపిక చేసిన సెలెక్టర్లు..  ఇప్పుడు  మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు జట్టును ప్రకటించారు. యువ సంచలనం శుభ్‌ మన్‌ గిల్‌ తొలిసారి టెస్ట్‌ జట్టులోకి  ఎంపిక కాగా..  హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మను టెస్టుల్లోనూ  ఓపెనర్‌గా ఎంపిక చేశారు.

వచ్చే నెలలో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కు మొత్తం 15 మంది  ప్లేయర్లను ఎంపిక చేశారు  సెలెక్టర్లు.  కెప్టెన్‌ విరాట్ కోహ్లీ,  వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే తో పాటు మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌ శర్మ, చతేశ్వర పుజారా, హనుమ విహారి, రిషబ్‌ పంత్‌, వృద్ధిమాన్‌ సాహా,  రవిచంద్రన్‌ అశ్విన్‌,  రవీంద్ర జడేజా, కుల్‌ దీప్‌ యాదవ్‌, మహమ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ, బుమ్రా, శుభ్‌మన్‌ గిల్‌ ను ఎంపిక చేశారు.

గత పర్యటనలో జట్టులో చోటు లభించిన కేఎల్‌ రాహుల్‌, ఉమేష్‌ యాదవ్‌ లపై సెలెక్టర్లు వేటు వేశారు. గత యేడాది కాలంగా  రాహుల్‌ వరుసగా  విఫలమవుతుండడంతో అతనిని తప్పించారు. ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లలో  సెంచరీలు,  డబుల్‌  సెంచరీలతో అదరగొడుతున్న యువ సంచలనం శుభ్‌మన్‌ గిల్‌ కు తొలిసారి టెస్ట్‌ జట్టులోకి తీసుకున్నారు.  అటు టెస్టుల్లోనూ ఓపెనర్‌గా రోహిత్‌ శర్మకు అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు నిర్ణయించారు.    పరిమిత ఓవర్ల క్రికెట్‌ లో హిట్‌ మ్యాన్‌గా.. ఎన్నో పరుగులు,  మరెన్నో రికార్డులను తిరగరాసిన రోహిత్‌ శర్మ ఇప్పుడు టెస్ట్ ల్లోనూ  ఓపెనర్‌గా  రానున్నాడు.  గతంలో రోహిత్‌ శర్మ కు మిడిల్‌ అర్డర్‌ లో ఎన్నో అవకాశాలు దక్కినా.. సక్సెస్‌ కాలేదు. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో సిరీస్‌ లో రోహిత్‌.. సత్తా  బయటపడుతుందని క్రీడా విశ్లేషకులు చెపుతున్నారు.  అటు టీమిండియాలోకి కేఎల్‌ రాహుల్‌ దారులు మూసుకుపోలేదని.. బీసీసీఐ తెలిపింది. రాహుల్ అద్భుత ప్రతిభగల ఆటగాడని.. ఫామ్‌లో లేక ఇబ్బందులు పడుతున్నాడని తెలిపింది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో.. తొలి మ్యాచ్‌ అక్టోబర్ 2న  వైజాగ్‌ లో ప్రారంభం కానుంది.