భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. మంగళవారం కూడా భారీగా పతనమయ్యాయి. జీడీపీ వృద్ధిరేటు నెమ్మదించడం.. పెరిగిన చమురు ధరలు.. డీలాపడ్డ ఆటోరంగం తోడవడటంతో మార్కెట్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఆరంభంలో స్వల్ప నష్టాలతో మొదలై మధ్యాహ్నం అయ్యే కొద్దీ భారీ నష్టాల్లోకి జారిపోయాయి. నేటి సెషన్లో సెన్సెక్స్‌ ఏకంగా 642 పాయింట్లు పడిపోయి 36,481 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 186 పాయింట్ల నష్టంతో 10,818 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 71.86 గా కొనసాగుతోంది. ఆటో, బ్యాంకింగ్‌, లోహ, మౌలిక, ఐటీ, ఫార్మా ఇలా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే సాగాయి.