రాజశేఖర్ క్షేమంగానే ఉన్నారు

ప్రముఖ హీరో రాజశేఖర్‌ కారు బోల్తా పడింది. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వెళ్తున్న ఆయన కారు అదుపు తప్పి బోల్దా పడిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌కు స్వల్ప గాయాలు కాగా.. ఆయనతో పాటు కారులో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. కారు బోల్తా పడిన వెంటనే ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో  పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.

విజయవాడలో ఓ కార్యక్రమానికి హాజరైన రాజశేఖర్‌ తిరిగి హైదరాబాద్‌ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్‌లో పాల్గొన్నారు. షూటింగ్‌ ముగించుకుని ఇంటికి వెళుతుండగా.. అవుటర్ రింగ్ రోడ్డుపై కారు టైరు పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆయన సతీమణి జీవిత తెలిపారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కాళ్లు, చేతులకు గాయాలు అయినట్టు ఆమె చెబుతున్నారు. అదృష్టవశాత్తూ.. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారని జీవిత చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని జీవిత చెప్పారు.