పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా

పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదాపడ్డాయి. నవంబర్‌ 18న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు శుక్రవరంతో ముగిశాయి. సమావేశాల చివరిరోజు దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీకి చెందిన మహిళా ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్‌ సభలో క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. అటు రాజ్యసభలో కూడా రాహుల్‌ క్షమాపణ చెప్పాలని ఎంపీలు డిమాండ్ చేయడంతో ఉభయ సభలు 12 గంటల వరకు వాయిదాపడ్డాయి.

వాయిదా అనంతనం లోక్‌ సభలో డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడారు. రాహూల్ గాంధీ చేసిన రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలను డీఎంకే నేత, ఎంపీ కనిమొళి సమర్థించారు. రాహూల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా అనే నినాదం ఇచ్చారని, అయితే అది ఎక్కడా అమలు జరగడం లేదని, కానీ దేశ వ్యాప్తంగా ప్రస్తుతం మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్నారు. భారత్‌ అత్యాచారాలకు రాజధాని అన్న వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పేదేలేదన్నారు కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ. వ్యాఖ్యలపై బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పమనడాన్ని రాహుల్‌ వ్యతిరేకించారు. దేశ రాజధాని ఢిల్లీని రేప్‌ క్యాపిటల్ అని ప్రధాని మోదీ సంభోదించారని రాహుల్ గాంధీ అన్నారు. మోడీ అన్న మాటల వీడియో తన సెల్ ఫోన్‌ లో ఉందని మీడియాకు తెలిపారు.

అటు రాజ్యసభలోనూ ఇదే విషయంపై గందరగోళం నెలకొంది. రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలి అంటూ కొందరు ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. సభలో లేని వ్యక్తి పేరును చెప్పడం సరికాదు. సభకు ఆటంకం కలిగించొద్దని ఎంపీలను సూచించారు. అయినప్పటికీ సభ్యులు ఆందోళన చేయడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభలో ఆందోళనలు కొనసాగడంతో సభను నిరవధిక వాయిదావేశారు.

ఈసారి శీతాకాల సమావేశాలు పలు బిల్లులకు ఆమోదముద్ర వేశాయి. ముఖ్యంగా పౌరసత్వ సవరణ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలుపగా, చట్టంగా రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేశారు. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పొడిగింపు సవరణ బిల్లు, పన్నుల లా బిల్లు, ఈ-సిగరేట్ల నిషేధం బిల్లు, రీసెక్టింగ్ షిప్స్‌ బిల్లు, ఎస్పీజీ సవరణ బిల్లు, దాద్రానగర్‌ హావేలీ, డామన్ డయ్యూ విలీన బిల్లులకు శీతాకాల సమావేశాలు ఆమోదం తెలిపాయి.