ఉప్పల్ భగాయత్ ప్లాట్లపై బిల్డర్ల గురి

హెచ్‌ఎండీఏ అభివృద్ధిచేసిన ఉప్పల్‌ భగాయత్‌ ప్లాట్లను దక్కించుకొనేందుకు బిడ్డర్లు సిద్ధమయ్యారు. శనివారం నుంచి సోమవారం వరకు మూడురోజులపాటు ఉప్పల్‌ భగాయత్‌ ఫేజ్‌- 2 ద్వారా 127 ప్లాట్లకు హెచ్‌ఎండీఏ ఈ- వేలం నిర్వహించనున్నది. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు మొదటి సెషన్‌, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలవరకు ఈ- వేలం ప్రక్రియ కొనసాగనున్నది. ఎంఎస్‌టీసీ అనే సంస్థ సహకారంతో హెచ్‌ఎండీఏ కొన్ని రోజులుగా ఆసక్తి గల బిడ్డర్ల నుంచి రిజిస్టేషన్లను ఆహ్వానించగా, దాదాపు 2,900 మంది ఈ- వేలంలో కొత్తగా పాల్గొనేందుకు రిజిస్టర్‌ చేసుకున్నారు. ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌లో 127 ప్లాట్లు ఉండగా, 300 గజాలలోపు 21 ప్లాట్లు ఉన్నాయి. 1,66,989.14 చదరపు గజాల భూమిని వేలంలో ఉంచారు.

ఈ- వేలంను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని హెచ్‌ఎండీఏ అధికారులు అంటున్నారు.  రెసిడెన్షియల్‌ జోన్‌లో ఉన్న ప్లాట్లకు సంబంధించి గజానికి రూ.30 వేలు, కమర్షియల్‌ ప్లాట్లకు 40 వేలుగా ధర ఖరారుచేశారు. ఈ- వేలం ద్వారా రూ.950 కోట్ల మేర ఆదాయం వస్తుందని అధికారులు అంచనావేస్తున్నారు.