నిండుకుండలా శ్రీరాజరాజేశ్వర జలాశయం

కాళేశ్వరం ప్రాజెక్టు  అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. శ్రీరాజరాజేశ్వర జలాశయం కాళేశ్వర జలాలతో నిండుకుండను తలపిస్తున్నది. కాళేశ్వరం లింక్-2లో ఎత్తిపోతలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. దీంతో ఎస్సారార్ ప్రాజెక్టు నీటి మట్టం 25.873 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 22.604  టీఎంసీలు ఉంది.  ఆరో ప్యాకేజీ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది పంపుహౌస్‌లో ఈనెల 5 నుంచి రెండు మోటర్లను నడిపిస్తున్నారు. ఒక్కో మోటర్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున రెండు మోటర్లు 6,300 క్యూసెక్కులు ఎత్తిపోస్తుండగా, ఈ జలాలు నంది రిజర్వాయర్‌కు చేరుకున్నాయి. అక్కడి నుంచి జంట సొరంగాల ద్వారా 8వ ప్యాకేజీ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌస్‌కు తరలాయి. ఇక్కడ ఈ నెల 5 నుంచి రెండు పంపులు ఎత్తిపోస్తుండగా, గ్రావిటీ కెనాల్ ద్వారా వరద కాల్వ మీదుగా శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌కు జలాలు పరుగులు తీస్తున్నాయి.

అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మి పంప్‌హౌస్‌లో నాలుగు మోటర్లు నడిచాయి. పంప్‌హౌస్‌లోని 3, 5, 9, 11వ మోటర్ల ద్వారా 8,780 క్యూసెక్కుల నీరు సరస్వతి బరాజ్‌కు తరలించారు. మోటర్ల నుంచి వస్తున్న గోదావరి జలాలు డెలివరీ సిస్టర్న్ ద్వారా గ్రావిటీ కెనాల్ వెంట బరాజ్‌కు చేరుతున్నాయి. సరస్వతి బరాజ్‌లో ప్రస్తుతం 7.39 టీఎంసీల నీరు నిల్వ ఉంది .