క్యాబ్‌పై భగ్గుమంటున్న విద్యార్థిలోకం

పౌరసత్వ సవరణ చట్టం రగిలించిన వివాదం కొనసాగుతున్నది. తాజాగా మరో కొత్త వివాదం ముందుకొచ్చింది. క్యాబ్‌ను అమలు చేయబోమని పలు రాష్ర్టాలు ప్రకటిస్తుండగా.. ఈ అంశం కేంద్రం జాబితాలో ఉన్నదని, తిరస్కరించే హక్కు రాష్ర్టాలకు లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్తున్నది. పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పలుచోట్ల నిరసన ర్యాలీలు నిర్వహించారు. అయితే కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశంలోని అన్ని రాష్ర్టాలు తప్పనిసరిగా అమలుచేయాల్సిందేనని, తిరస్కరించే అధికారం వాటికి లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఏడో షెడ్యూల్‌లోని కేంద్ర జాబితాలో చేర్చిందని కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. ఏడో షెడ్యూల్‌లోని కేంద్ర జాబితాలో రక్షణ, రైల్వే, విదేశీ వ్యవహారాలు, పౌరసత్వం వంటి మొత్తం 97 అంశాలు ఉన్నాయి.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌, తృణమూల్‌ ఎంపీ మహువా మోయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరితోపాటు ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌ , పీస్‌ పార్టీ, రిహాయ్‌ మంచ్‌, సిటిజన్స్‌ అగెనెస్ట్‌ హేట్‌ స్వచ్ఛంద సంస్థలు, న్యాయవాది ఎంఎల్‌ శర్మ, పలువురు లా స్టూడెంట్స్‌ సైతం పిటిషన్లు దాఖలు చేశారు.

ఈశాన్య రాష్ర్టాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించినా, కర్ఫ్యూ విధించినా ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. అసోంలోని గువాహటిలో విధించిన నిరవధిక కర్ఫ్యూను ప్రజలు ధిక్కరించారు. ఆసుతోపాటు వివిధ సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది రోడ్ల మీదికి వచ్చి శాంతియుతంగా నిరసనలు తెలిపారు. నిరాహారదీక్షల్లో పాల్గొన్నారు. దీంతో రెండు రోజులుగా హింసతో అట్టుడికిన గువాహటి శుక్రవారం ప్రశాంతంగా కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఎనిమిది కంపెనీల అదనపు బలగాలను మోహరించినట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం అధికారులు కాసేపు కర్ఫ్యూను సడలించడంతో ప్రజలు నిత్యావసరాల కోసం దుకాణాలు, మార్కెట్లలో బారులు తీరారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోనూ నిరసనలు కొనసాగాయి. రాజ్‌భవన్‌ వద్ద నిరసనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పలు ప్రాంతాల్లో వాహనాలకు నిప్పు పెట్టారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో పలుచోట్ల విద్యార్థులు పరీక్షలను బహిష్కరించారు.

క్యాబ్‌కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జమియత్‌ ఉలేమా ఏ హింద్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ రణరంగంగా మారింది. ఆందోళనకారులు భద్రతాసిబ్బందిపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్‌ చేశారు. టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ ఘర్షణలో వందమందికిపైగా విద్యార్థులు గాయపడ్డారని వర్సిటీ సిబ్బంది తెలిపారు. 42 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు జరిగాయి. కోల్‌కతా, అరాబ్‌భాగ్‌, మిడ్నాపూర్‌, తదితర ప్రాంతాల్లో శాంతియుతంగా నిరసన జరుగగా, హౌరా, ముర్షీదాబాద్‌లో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ముర్షీదాబాద్‌లో బెల్దండా రైల్వేస్టేషన్‌ను ధ్వంసం చేయడంతోపాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఓ అంబులెన్స్‌ పైనా రాళ్లు రువ్వారు. హౌరాలో నడుస్తున్న రైళ్లపై రాళ్లు రువ్వారు. ఉత్తరప్రదేశ్‌లోనూ నిరసనలు మిన్నంటాయి. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులు భారీ ఎత్తున నిరసనలు తెలిపారు. తెలంగాణ, బీహార్‌, గోవా, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లోనూ నిరసనలు కొనసాగాయి.

పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య రాష్ర్టాల్లో నిరసనలు హోరెత్తుతుండటంతో జపాన్‌ ప్రధాని షింజో అబే తన భారత పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఏటా జరిగే భారత్‌-జపాన్‌ ద్వైపాక్షిక సదస్సు ఈ నెల 15 నుంచి 17 వరకు గువాహటిలో నిర్వహించాల్సి ఉన్నది. అయితే ప్రస్తుతం గువాహటి ఆందోళనలు, హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న నేపథ్యంలో జపాన్‌ ప్రధాని షింజో అబే తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈశాన్య రాష్ర్టాల పర్యటన సైతం రద్దయింది.