అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై అభిశంసన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన ప్రక్రియను ప్రతినిధుల సభ జ్యుడీషియరీ కమిటీ ప్రారంభించింది. రెండు రోజుల పాటు డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై చర్చించనుంది. అనంతరం.. అభిశంసన అభియోగాలపై ఓటింగ్‌ జరపనుంది. ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి, అమెరికన్‌ కాంగ్రెస్‌ కార్యకలాపాలను ఆటంకపరిచేందుకు ప్రయత్నించారని అభియోగాలు మోపిన డెమోక్రాట్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వీటిపై జ్యుడీషియరీ కమిటీ చర్చించి అవసరమైన సవరణలు చేసే అవకాశం ఉంది. ట్రంప్‌పై అభిశంసన తీర్మానానికి సవరణలు చేయాలని రిపబ్లికన్లు ప్రతిపాదిస్తున్నారు. ఇందు కోసం 9 పేజీల సవరణ ప్రతిపాదనలు రూపొందించారు. అయితే డెమొక్రాట్లు ఇందుకు అంగీకరించే అవకాశాలు కనిపించడం లేదు. ట్రంప్‌.. 2020 ఎన్నికల్లో తన స్వప్రయోజనాల కోసం ప్రత్యర్థుల్ని అణగదొక్కే ప్రయత్నాల్లో ఉన్నారని ఆరోపిస్తున్నారు. 41 మంది సభ్యుల ప్యానెల్‌ ట్రంప్‌ అభిశంసనపై చర్చను ప్రారంభించింది. డెమోక్రాట్ల అభియోగాలను పరిశీలించి.. హౌస్‌ ఫ్లోర్‌కు పంపడానికి ఓటింగ్‌ జరుపుతుంది.