గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన దిల్ రాజు…

పర్యావరణ హితం కాంక్షిస్తూ… రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు భాగస్వాములై.. మొక్కలు నాటుతున్నారు. ఈ మేరకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించి తన మనువడితో కలిసి మూడు మొక్కలు నాటారు. అయితే..గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విసిరిన చాలెంజ్ దిల్ రాజు స్వీకరించారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ… ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌ వలన మన రాష్ట్రం, మన దేశం ఆకుపచ్చగా మారబోతుందన్నారు. ఈ సందర్భంగా సంతోష్ కు అభినందనలు తెలిపారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం… ప్రముఖ హీరో మహేష్ బాబు, డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడిలను మొక్కలు నాటాల్సిందిగా సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.