భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రెండో వన్డే

రాజ్ కోట్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా నడుమ ఇవాళ రెండో వన్డే మ్యాచ్ జరగనున్నది. అభిమానుల అంచనాలకు తలికందులు చేస్తూ.. తొలి పోరులో ఓటమి పాలైన కోహ్లీ  సేన.. రెండో వన్డేలో గెలిచి లెక్క సరి చేయాలనే కసితో ఉన్నది.  అటు ఆసీస్‌ మాత్రం రెండో వన్డేలోనూ గెలుపొంది.. వన్డే సిరీస్‌ ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నది.

ఆసీస్‌తో వన్డే సిరీస్‌ ముందు అంచనాలన్నీ ఒక్క మ్యాచ్‌తో తలకిందులయ్యాయి. ముంబై వన్డేలో పది వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలు కావడంతో.. ఆసీస్‌ చేతిలో వన్డే సిరీస్‌ కోల్పోక తప్పదా  అనే అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ రాజ్‌ కోట్‌ వేదికగా..  జరిగే  రెండో వన్డే  కోహ్లీ సేనకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది. సిరీస్‌ లో నిలవాలంటే  గెలిచి తీరాల్సిన పరిస్థితి కోహ్లీ సేనది.  అటు తొలి వన్డే  గెలుపుతో లభించిన ఉత్సాహంలో  రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఆసీస్‌ భావిస్తోంది. దీంతో రాజ్‌ కోట్ వన్డేలో నువ్వా నేనా అన్నట్టు సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

కొన్నేళ్లుగా సిరీస్‌ల మీద సిరీస్‌లు గెలుస్తూ వచ్చిన టీమిండియాకు ముంబై వన్డే ఝలక్‌ ఇచ్చింది. దాంతో ఈ మ్యాచ్‌లో తుది జట్టు కూర్పుతో పాటు తాను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలనేది కెప్టెన్‌ కోహ్లీకి సవాల్‌గా మారింది. తొలి వన్డేలో చేసిన ప్రయోగాలు ఫెయిల్ కావడంతో.. కోహ్లీ తిరిగి మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసే అవకాశముంది. ఓపెనర్లుగా రోహిత్‌, ధావన్‌ ఉండడంతో.. మిడిల్‌ అర్డర్‌ లో కేఎల్‌ రాహుల్‌, శ్రేయాష్‌ అయ్యర్‌ స్థానాలు పక్కా. ఇక బౌలింగ్‌లో బుమ్రా, షమీకి తోడు జడేజా, కుల్‌ దీప్‌ లు ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక తొలి వన్డేలో గాయంతో దూరమైన కీపర్‌ రిషబ్‌ పంత్‌ స్థానంలో జాదవ్‌ లేదా మనీష్‌ పాండేకు స్థానం లభించే అవకాశమున్నది.

తొలి వన్డే జరిగిన పిచ్‌ తో పోల్చితే.. రాజ్‌ కోట్ పిచ్‌ బ్యాటింగ్‌ కు మరింత అనుకూలంగా ఉండే అవకాశమున్నది. భారీ స్కోర్లు చేసే అవకాశముండడంతో.. టాస్‌ నెగ్గి జట్టు ఛేజింగ్‌ వైపే మొగ్గు చూపే అవకాశమున్నది. భారత్ పడిలేచిన కెరటంలా.. తలపడితే.. ఈ మ్యాచ్‌ అభిమానులను అలరించడం ఖాయం.