ఈ నెల 31, ఫిబ్రవరి 1న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

దేశవ్యాప్తంగా రెండు రోజులు బ్యాంకుల సమ్మె చేపట్టనున్నట్టు బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు తెలిపాయి. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ తో చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీలలో తాము సమ్మె చేయనున్నామని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ ప్రకటించింది. నెల రోజుల వ్యవధిలో బ్యాంకులు సమ్మె నిర్వహించటం ఇది రెండోసారి. జనవరి 31న పార్లమెంటులో ఆర్థిక సర్వేను కేంద్రం సమర్పించనుంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు రోజుల్లో సమ్మెతో దేశ ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.