బ్రిటన్‌ క్వీన్స్‌ కౌన్సెల్‌గా హరీశ్‌ సాల్వే!

భారత్‌కు చెందిన న్యాయ కోవిదుడు, మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీష్‌ సాల్వే మరో ఘనతను సాధించారు. ఇంగ్లాండ్‌, వేల్స్‌ కోర్టులకు సంబంధించి క్వీన్స్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు. బ్రిటన్‌ మహారాణి ఆస్థాన న్యాయవాది పదవిని సాల్వే మార్చి 16న చేపట్టనున్నారు. న్యాయశాస్త్రంలో అసామాన్య ప్రజ్ఞ కనబరిచిన వారికి మాత్రమే ఈ గౌరవం దక్కుతుంది. ఈ నియామకానికి సంబంధించి బ్రిటన్‌ న్యాయశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం వేదికగా భారత్‌ తరఫున.. హరీశ్ సాల్వే అద్భుతంగా వాదించి అందరి మన్ననలు పొందారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ కేసుకు ఫీజుగా ఆయన కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకోవటం విశేషం.