నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య చివరి వన్డే

భారత్, ఆస్ట్రేలియా మధ్య పోరు తుది అంకానికి చేరుకుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా  ఇవాళ నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. టీమిండియా, ఆసీస్ ఇప్పటికే చెరో మ్యాచ్ గెలవడంతో… ఆఖరి వన్డేలో గెలిచి సిరీస్‌ చేజిక్కించుకోవాలని ఇరుజట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్ పోరు రసవత్తరంగా జరగడం  ఖాయంగా కనిపిస్తోంది.

తొలి మ్యాచ్‌ ఓటమి నుంచి త్వరగానే కోలుకున్న టీమిండియా.. రాజ్‌కోట్‌లో రాణించి సిరీస్‌ సమం చేసింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న కోహ్లీసేన.. ఒక్కరోజు విరామంతోనే మరో కీలక పోరుకు రెడీ అయింది. ఇవాళ చిన్నస్వామి స్డేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. ఇరుజట్లు సిరీస్‌ పై కన్నేసిన నేపథ్యంలో బెంగళూరులో పరుగుల వరద ఖాయంగానే కనిపిస్తున్నది. వాంఖడే స్టేడియంలో తడబడ్డ భారత బ్యాటింగ్‌ లైనప్ రెండో వన్డేలో సమిష్టిగా రాణిస్తే.. ఆసీస్‌ తరపున స్టీవ్ స్మిత్ ఒంటరి పోరాటం చేశాడు. ప్రయోగాల జోలికి పోకుండా.. గత మ్యాచ్‌ బ్యాటింగ్ లైనప్‌నే కొనసాగించాలని టీమిండియా భావిస్తుంటే.. కంగారులు మాత్రం యువ పేసర్ కేన్ రిచర్డ్ స్థానంలో హాజిల్‌వుడ్‌ కు తుది జట్టులో స్థానం కల్పించే అవకాశాలు ఉన్నాయి. రెండు టీంలు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉండడంతో ఆఖరి వన్డేలో హోరాహోరీ తప్పదనిపిస్తుంది.

ఇర ముంబై పిచ్‌పై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన టీమిండియా బౌలర్లు.. రాజ్‌కోట్‌ వన్డేలో చక్కటి ప్రదర్శన కనబర్చారు. మరో పేసర్‌ షమీ వికెట్లు పడగొడుతున్నా.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. బెంగళూరులో మంచి రికార్డు ఉన్న చాహల్ కు తుది జట్టులో చోటు దక్కుతుందా చూడాలి. ఒకవేళ అతడిని ఎంపిక చేస్తే.. కుల్దీప్‌ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. స్పీన్‌ ఆల్‌ రౌండర్‌గా జడేజా తుదిజట్టులో ఉండడం ఖాయమే.

మరోవైపు రాజ్‌కోట్‌ వన్డే ఓటమితో కసిమీదున్న కంగారులు.. మూడో వన్డే లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. వార్నర్, ఫించ్‌, స్మిత్, లబుషేన్, కారీ జోరుమీదుండగా.. బౌలింగ్‌ లో జంపా ఇరగదీస్తున్నాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను జంపా తన బంతులతో బోల్తా కొట్టిస్తున్నాడు. అగర్‌ కూడా ఓ చేయి వేస్తే.. స్పిన్ విభాగానికి మరింత బలం చేకూరనుంది. స్టార్క్‌, కమిన్స్‌తో పాటు కేన్ రిచర్డ్‌ సన్‌కు బదులు హజిల్ వుడ్‌ బరిలో దిగే అవకాశం ఉంది.