ఎయిర్‌టెల్‌ రూ.179 ప్లాన్‌.. విత్ లైఫ్ ఇన్సూరెన్స్!

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ జీవిత బీమాతో కూడిన మరో ప్రీపెయిడ్ ప్యాక్‌ను తీసుకొచ్చింది. రూ. 2 లక్షల జీవిత బీమాతో కూడిన… రూ. 179 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఆదివారం ప్రకటించింది. అన్ లిమిటెడ్‌ కాల్స్‌, 28 రోజుల గడువుతో పాటు.. 2జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్‌లను ఇవ్వనుంది. దీంతోపాటు కస్టమర్లు ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీం యాప్‌ ప్రీమియం, వింక్‌ మ్యూజిక్‌ యాప్‌ సేవలు పొందవచ్చు. వీటితో పాటు అదనంగా రూ.2 లక్షల విలువైన భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ అందించే జీవిత బీమా బండిల్‌గా ఇవ్వనున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. కాగా.. 18 నుంచి 54 ఏళ్ల వయస్సు మధ్య కలిగిన వారికి మాత్రమే వర్తించనున్న ఈ జీవిత బీమా కోసం… ఎలాంటి పత్రాలు, వైద్య పరీక్షలు గానీ అవసరం లేదని వెల్లడించింది. ఈ బీమాకు సంబంధించిన పత్రాలను డిజిటల్ రూపంలో వెంటనే అందిస్తామని.. అవసరమైతే కాగితం రూపంలోనూ అందిస్తామని ఎయిర్ టెల్‌ పేర్కొంది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్‌ను పరిమితంగా వినియోగించే వారిని, ఫీచర్‌ ఫోన్లు వినియోగించే వారిని లక్ష్యంగా ఈ ప్లాన్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.