చివరి వన్డేలో ఘన విజయం, సిరీస్ భారత్‌దే…

బెంగళూరు వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. చివరి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో ఆసీస్‌పై గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో సిరీస్‌ భారత్ కైవసం చేసుకుని… గతేడాది సిరీస్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ సిరీస్‌ తొలి వన్డేలో ఓడిపోయిన భారత్… కంగారూలపై చివరి రెండు వన్డేల్లో ఘన విజయాన్ని నమోదు చేసి, సిరీస్‌ దక్కించుకుంది.

చివరి వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా… నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. భారత్‌కు 287 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆసీస్‌ బ్యాటింగ్‌ సంచలనం స్టీవ్‌ స్మిత్‌ సెంచరీ(132 బంతుల్లో 131: 14 ఫోర్లు, 1 సిక్స్‌)తో చెలరేగాడు. రెండో వన్డేలో తృటిలో సెంచరీ చేజార్చుకున్న స్మిత్‌.. బెంగళూరు వన్డేలో విజయవంతంగా సెంచరీ పూర్తిచేశాడు. సైనీ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి ఈ ఫీట్‌ సాధించాడు. కాగా, స్మిత్‌కు ఇది వన్డేల్లో 9వ సెంచరీ కాగా, భారత్‌పై 3వ సెంచరీ. అతనికి మార్నస్‌ లబుషేన్‌(54) నుంచి చక్కటి సహకారం లభించింది. అలెక్స్‌ క్యారీ 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఒకానొక దశలో ఆస్ట్రేలియా 43.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసి, భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ, స్టీవ్‌ స్మిత్‌ను షమీ ఔట్‌ చేయడంతో, మిగితా బ్యాట్స్‌మెన్‌ తేలిపోయారు. భారత బౌలర్లలో.. మహమ్మద్‌ షమీ 4 వికెట్లతో రాణించగా.. జడేజా 2, కుల్దీప్‌ యాదవ్‌, నవదీప్‌ సైనీ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. నిలకడగా ఆడుతూ.. మూడు వికెట్ల నష్టానికి, 50 ఓవర్లలో మరో 15 బంతులు మిగిలుండగానే 287 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించింది. ఒపెనర్‌ ధావన్‌కు గాయం కావడంతో.. ఓపెనర్ గా వచ్చిన రాహుల్ 19 పరుగులు చేసి నిరాశ పరిచాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లితో కలిసి మరో ఓపెనర్ రోహిత్ శర్మ 150 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆచితూచి ఆడుతూ ఇద్దరు స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి సెంచరీ(119) సాధించాడు. వన్డేల్లో 29వ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత వేగంగా ఆడే క్రమంలో 119 పరుగుల వద్ద జంపా బౌలింగ్‌లో స్టార్క్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కాగా, ఆస్ట్రేలియాపై రోహిత్‌కు ఇది 8వ సెంచరీ కావడం విశేషం. అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక మాజీ బ్యాట్స్‌మెన్‌ సనత్‌ జయసూర్య(28 సెంచరీలు) అధిగమించి రోహిత్‌ నాలుగో స్థానం సంపాదించాడు. అతని కన్నా ముందు సచిన్‌, విరాట్‌ కోహ్లి, రికీ పాంటింగ్‌ మాత్రమే ఉన్నారు.

రోహిత్ తర్వాత వచ్చిన యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ జాగ్రత్తగా ఆడుతూ.. భారత్‌ను విజయం అంచుల వరకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. విజయానికి మరో 13 పరుగులు అవసరం అనుకున్న తరుణంలో… హెజిల్ వుడ్ బౌలింగ్‌లో (91 బంతుల్లో 8 ఫోర్లు) 89 పరుగులు చేసి కోహ్లీ ఔట్ అయ్యాడు. కాగా, శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 1 సిక్స్ 6 ఫోర్లు) 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ తర్వాత వచ్చిన మనీష్ పాండేతో కలిసి అయ్యర్ మ్యాచ్‌ను ముగించాడు. దీంతో మరో 7 వికెట్లు, 15 బంతులు మిగిలి ఉండగానే టీం ఇండియా విజయం సొంతం చేసుకుంది. ఇక.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మకు దక్కింది.