రజనీకాంత్ ఆలోచించి మాట్లాడు :స్టాలిన్

ద్రవిడ పితిమహుడు పెరియార్‌పై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో దుమారం రేపుతున్నాయి. ఆయన ఇంటిముందు తమిళ సంఘాలు ఆందోళనలు కూడా చేపట్టాయి. తాజాగా దీనిపై డీఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ స్పందిస్తూ… “మిత్రుడు రజనీకాంత్ రాజకీయ నాయకుడు కాదు. రజనీ ఓ నటుడు. పెరియార్ లాంటి వాళ్ల గురించి మాట్లాడేటప్పుడు ఓసారి ఆలోచించి మాట్లాడాలని కోరుతున్నాను“ అని స్టాలిన్ అన్నారు. జనవరి 14న జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్.. 1971 లో జరిగిన ర్యాలీలో పెరియార్ సీతారాముల విగ్రహాలను అభ్యంతరకరంగా ఊరేగించారని వ్యాఖ్యానించినట్టు ఓ పత్రికలో ప్రచురితమైంది. దీంతో… పెరియార్‌ గురించి రజనీకాంత్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ద్రవిడర్‌ విడుదలై కళగమ్‌ (డీవీకే) పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెరియార్ ప్రతిష్ట దెబ్బతినేలా రజనీ వ్యాఖ్యానించారని మండిపడింది. కానీ, రజనీ మాత్రం తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.