మేడారం మహాజాతరలో తొలిఘట్టం పూర్తి…

తెలంగాణ కుంభమేళా, మేడారం వనదేవతలు సమ్మక్క సారలమ్మల మహా జాతరకు బుధవారం అంకురార్పణ జరిగింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ పూజా మందిరాల్లో గుడిమేలుగే పండుగను… సమ్మక్క-సారక్కల పూజారులు నిర్వహించారు. కాకవంశీయులు, సిద్ద బోయిన వంశీయులు వేకువజామున నిద్రలేచి, ఇళ్లను శుద్ధి చేసుకుని.. అనంతరం అమ్మవార్ల ఆలయాలను శుద్ధిచేశారు. తర్వాత నూతన వస్ర్తాలను ధరించి… డోలి వాయిద్యాల మధ్య సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లి గుట్ట గడ్డిని సేకరించారు. దానిని అమ్మవార్ల పూజా మందిరాలపై కప్పిన అనంతరం… గద్దెలకు అలుకుపూత నిర్వహించి, రంగు రంగుల ముగ్గులతో అలంకరించారు. తరువాత పూజారులు ఆలయంలో పూజలు నిర్వహించి.. దీపం పెట్టడంతో మహాజాతరకు అంకురార్పన జరిగింది. ఆ దీపం మళ్లీ రెండేళ్ల వరకు అలాగే వెలుతూనే ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు.

ఈ గుడిమెలిగే పండుగతో అమ్మవార్ల మహాజాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు. ఇవాళ్టి నుంచి నాలుగు బుధవారాల పాటు మేడారం జాతర కొనసాగుతుంది. కాగా.. రెండో బుధవారం అంటే జనవరి 29న మండమెలిగెను నిర్వహిస్తారు. మూడో బుధవారం అంటే ఫిబ్రవరి 5న అమ్మవార్ల మహాజాతర ప్రారంభమవుతుంది. జాతరలో చిలుకలగుట్టపైనున్న సమ్మక్క తల్లిని ఫిబ్రవరి 6న సాయత్రం గద్దెపై ప్రతిష్టాపన చేస్తారు. ఫిబ్రవరి 7న సమ్మక్క–సారలమ్మలతో పాటు పగిడిద్ద రాజులు, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఫిబ్రవరి 8న అమ్మవార్ల తిరుగు ప్రయాణంగా వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. ఆ తర్వాత చివరి(4వ) బుధవారం అంటే ఫిబ్రవరి 12న తిరుగువారం నిర్వహింస్తారు. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ మహా జాతరకు వివిధ రాష్ట్రాల నుంచే కాక ఇతర దేశాల నుంచి కూడా భక్తులు తరలిరానున్నారు.