నిత్యానందపై ఇంటర్‌పోల్ బ్లూకార్నర్ నోటీసు…

ఆధ్మాతిక‌వేత్త నిత్యానందపై ఇంటర్‌పోల్ బ్లూకార్నర్‌ నోటీసులు జారీ చేసింది. గతంలో ఆహ్మదాబాద్‌లోని ఆశ్రమం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఆదృశ్యమైన కేసులో నిత్యానందపై ఎఫ్ఐఆర్ న‌మోదు అయ్యింది. చిన్న పిల్లలను ఆశ్రమంలో బంధించి, లైంగికంగా వేధించిన‌ట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద… గ‌త ఏడాది విదేశాల‌కు పారిపోయాడు. గుజ‌రాత్‌, క‌ర్ణాట‌క పోలీసుల వాంటెడ్ లిస్టులో నిత్యానంద… తాజాగా కొన్ని వీడియోలో కనిపించారు. ఈక్వెడార్‌లో కైలాసాన్ని నిర్మించ‌నున్నట్లు ఓ వీడియోలో నిత్యానంద చెప్పారు. ఆ వీడియోలతో వివాదం ముదిరింది. తాజాగా గుజరాత్ పోలీసుల విజ్ఞప్తితో… నిత్యానంద ఆచూకీ ఉంటే తెలుపాల‌ని ఇంట‌ర్‌పోల్ బ్లూకార్నర్‌ నోటీసులు జారీ చేసింది. అయితే… నిత్యానంద ఈక్వెడార్‌లో లేర‌ని ఆ దేశం ఎంబసీ తెలిపింది. ఓ దీవిని కొని, దానికి కైలాసం అని నిత్యానంద‌ పేరుపెట్టిన అంశాన్ని ఈక్వెడార్ కొట్టిపారేసింది. నిత్యానంద ఈక్వెడార్‌ను వదిలి హైతీకి పారిపోయిన‌ట్లు ఆదేశం స్పష్టం చేసింది.