ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్…

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటలకు ముగిసింది. తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. అయితే.. పోలింగ్ టైం ముగిసేలోపు క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. సాయంత్రం 5 గంటల వరకు… దాదాపు 80 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9 కార్పొరేషన్లలో 325 డివిజన్లకు, 120 మున్సిపాలిటీల్లో 2,727 కౌన్సిలర్ల స్థానాలకు పోలింగ్ జరిగింది. కాగా… కార్పొరేషన్లలో ఒక డివిజన్‌, మున్సిపాలిటీల్లో 80 వార్డులు ఏకగ్రీవం కాగా.. తొమ్మిది కార్పొరేషన్ల బరిలో 1,747 మంది, 120 మున్సిపాలిటీల్లో 11,099 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది.

ఉదయం నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ మున్సిపల్ పోలింగ్ నిర్వహించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించారు. పలు కేంద్రాల్లో పోలింగ్ పక్రియను వీడియో రికార్డు చేశారు. కొంపల్లిలోని 10 పోలింగ్‌ కేంద్రాల్లో ఫేస్‌ రికగ్నేషన్‌ ద్వారా ఓటర్లను గుర్తించారు. ఇక, మొత్తంగా బ్యాలెట్ బాక్సుల్లోని అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 25న ఫలితాలతో తేలనుంది.