మున్సిపోల్స్‌లో ఓటేసిన ప్రముఖులు…

పురసమరం ముగిసింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పలువురు ప్రముఖులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు క్యూలైన్లలో నిల్చుని మరీ ఓటేసి… ఓటుహక్కు ప్రాధాన్యతను చాటిచెప్పారు. ప్రజాస్వామ్యంలో సామాన్యుడి ఆయుధమైన ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి పట్టణంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక జూనియర్ కాలేజీలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజా స్వామ్యంలో ఓటు ఆయుధం వంటిదని.. దానిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌ నగర్ మున్సిపాలిటీలోని పద్మాలయ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. సూర్యాపేట లోని నెహ్రూ నగర్ సిద్దార్థ్ స్కూల్ లో మంత్రి జగదీష్ రెడ్డి సతీసమేతంగా ఓటేశారు. తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని రెడ్డి కాలనీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో అన్ని కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ దంపతులు, పరిగి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి దంపతులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి దంపతులు మక్తల్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘ పరిధిలో ఎమ్మెల్యే రమేశ్ బాబు.. ఓటుహక్కును వినియోగించుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో 18వ వార్డు పరిధిలో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ దంపతులు.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్షర స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటువేశారు.

నాగార్జున సాగర్ లో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఓటుహక్కును వినియోగించుకున్నారు. మహబూబా బాద్ పట్టణంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తమ ఓటు హక్కు ను వినియెగించుకున్నారు. కలెక్టర్ శివలింగయ్య దంపతులు, ఎస్పీ కోటిరెడ్డి దంపతులు కూడా ఓటు వేశారు. డోర్నకల్ లో ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన కుమారుడు గౌతమ్ రెడ్డితో కలిసి ఓటు వేశారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. కుటుంబసమేతంగా ఓటువేశారు.

పెద్దపల్లి జిల్లాలోని సుభాష్ నగర్ మండల కేంద్రంలో టిఎస్.టీఎస్. చైర్మన్ చిరుమల్ల రాకేష్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా.. పోలింగ్ కేంద్రానికి వచ్చిన రాకేష్ కుమార్.. ఓటు వేశారు. నిజామాబాద్ లోని 42వ డివిజన్ న్యూహౌసింగ్ బోర్డ్ ప్రియదర్శిని కాలనీలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోధన్ లో ఎమ్మెల్యే షకీల్ దంపతులు, ఆర్మూర్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓటువేశారు. మామిడిపల్లిలోని విజయ్ డిగ్రీ కళాశాలలో జీవన్ రెడ్డి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఓటువేశారు.