తెలంగాణలో పెట్టుబడులకు అంతర్జాతీయ సంస్థల ఆసక్తి…

నూతన రాష్ట్రం పెట్టుబడుల కేంద్రంగా మారుతోంది. గడిచిన ఐదేళ్లలో విశ్వనగరం హైదరాబాద్‌లో పలు రకాల కంపెనీలు కొలువుదీరగా… తాజాగా మరిన్ని వచ్చి ఈ జాబితాలో చేరుతున్నాయి. తెలంగాణలో ఉన్న మౌలిక వసతులతో పాటు… రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఊతంతో తెలంగాణ‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంత‌ర్జాతీయ కంపెనీలు ఆస‌క్తి చూపుతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రం తయారీ కేంద్రంగా మారుతోంది. రాష్ట్రానికి వస్తున్న ఉన్నత స్థాయి కపెంనీలు, అనేక కీల‌క‌మైన ప్రాజెక్టులు తెలంగాణకు మ‌ణిహారంగా నిలుస్తున్నాయి.

దావోస్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోర‌మ్‌లో పాల్గొన్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్… రాష్ట్రంలో పెట్టుబడులకు పలు అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థల అధిపతులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, మౌలిక వసతులపై వివరిస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే… భారత్‌లో అద్భుత అవకాశాలు ఉన్నాయని వివరించారు. తెలంగాణలో అనుసరిస్తున్న టీఎస్ ఐపాస్ విధానాన్ని వారికి తెలియజేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు.

మంత్రి కేటీఆర్ ఆహ్వానం మేరకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. బుధవారం దావోస్‌లో హెల్త్ కేర్ రంగానికి చెందిన పిరామల్‌ సంస్థ చైర్మన్‌ అజయ్‌ పిరామల్‌తో… మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. దావోస్‌లో ఉన్న తెలంగాణ పెవీలియ‌న్ వ‌ద్ద పిరామ‌ల్ సంస్థతో ఆయన సంప్రదింపులు జ‌రిపారు. ఈ మేరకు పిరామల్ గ్రూప్ సంస్థ తెలంగాణలో రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. కొత్త వసతుల రూపకల్పన, వేర్‌హౌజ్‌ విస్తరణ కోసం ఆ నిధులను ఖర్చు చేయనున్నది. త‌మ పెట్టుబ‌డితో సుమారు 500 మందికి ఉపాధి కల్పించనున్నట్టు పిరామ‌ల్ సంస్థ పేర్కొంది. కాగా.. పిరమిల్ సంస్థ నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఆ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు కావాల్సిన అనుమతులను మంజూరు చేస్తామన్నారు.

అలాగే… కేపీజీఎం గ్లోబ‌ల్ చైర్మన్ బిల్ థామ‌స్‌, అమెరికాకు చెందిన బీఏఈ సిస్టమ్స్‌తోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. బీఏఈ సిస్టమ్స్‌ చైర్మన్… స‌ర్ రోజ‌ర్ కార్‌ను కేటీఆర్ క‌లిశారు. రక్షణ వ్యవస్థ భద్రతకు సంబంధించి బీఏఈ సిస్టమ్స్‌ ప్రపంచంలోనే నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థతో సంప్రదింపులు జరిపిన మంత్రి… తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించారు. ఇప్పటికే బోయింగ్ సహా పలు ఎరోస్పేస్ రంగాలు రాష్ట్రంలో ఉత్పత్తులను కొనసాగిస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దావోస్‌లోని తెలంగాణ పెవిలియ‌న్ వ‌ద్ద హెచ్‌సీఎల్‌టెక్ అధినేత క‌ల్యాణ్ కుమార్‌ తోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌, మ‌హింద్రా లిమిటెడ్ ఎండీ గోయంకాను కూడా కేటీఆర్ క‌లిశారు.

అనంతరం ఫార్మా దిగ్గజం టకేడా ఫార్మా గ్లోబల్ వ్యాక్సీన్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజీవ్ వెంకయ్యను మంత్రి కేటీఆర్ కలిశారు. రాష్ట్రంలో ఫార్మా రంగం అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. రాష్ట్రంలో ఫార్మా హబ్‌గా మారుతున్న తీరును తెలిపారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులకు ఆహ్వానించారు. అటు ప్రపంచంలోనే అతిపెద్ద, వందేళ్ల చరిత్ర కలిగిన ఆటోమేషన్ కంపెనీ రాక్ వెల్ ఆటోమేషన్ సీఈవో, ప్రెసిడెంట్ బ్లాకే మోరెట్‌తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఆటోమేషన్ రంగానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలోని ఇండస్ట్రీస్, ఇన్ఫర్మేషన్ కంపెనీల్లో ఆటోమేషన్ అవసరాలను తెలిపారు. ఆ తర్వాత గ్లోబర్ డిజైన్ కంపెనీ ఐడో సీఈవో శాండీను మంత్రి కేటీఆర్ కలిశారు. డిజైనింగ్ రంగానికి తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించారు.

ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్, ఉపాధి అవకాశాలను సర్వే నిర్వహించే కేపీఎంజీ సంస్థ చైర్మన్, సీఈవో బిల్ థామస్‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. సోషల్ మీడియాలో అభిప్రాయ సేకరణ సర్వేల ద్వారా కేపీఎంజీ సంస్థ ఏ దేశంలో ఎలాంటి వ్యాపారాలకు, పరిశ్రమలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయో తెలియజేస్తుంది. బిల్ థామస్‌కు తెలంగాణలో వ్యాపారవేత్తలకు కల్పిస్తున్న సౌకర్యాలు, అమలు చేస్తున్న విధానాలను, ఐటీ సహా వివిధ వ్యాపారాలకు రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను వివరించారు. గూగుల్, అమెజాన్ సహా ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలు తెలంగాణలో కొలువుదీరాయని తెలిపారు. గ్లోబల్ బిజినెసింగ్ సంస్థలకు తెలంగాణ అద్భుతమైన వేదికగా కేటీఆర్ వివరించారు. ఇప్పటికే, తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ మెంట్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని కల్పించింది. ఫార్మా, ఏరో, ఎలక్ట్రానిక్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజైనింగ్ సహా పలు రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. వీటన్నింటి గురించి మంత్రి కేటీఆర్ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సంస్థల అధిపతులకు వివరించారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు కేటీఆర్ వెంట ఉన్నారు.

అటు.. దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ను స్విట్జర్లాండ్‌, యూకే టీఆర్‌ఎస్‌ టీమ్స్‌ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్‌ఎస్‌ నాయకులు కేటీఆర్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రవాస భారతీయుల విధాన రూపకల్పనకు కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో కేటీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని పలు అంశాలపై కూడా చర్చించినట్లు ఎన్నారై ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి అవసరమైనంత వరకు సహాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఇక ఎన్నారై పాలసీ త్వరలోనే అమల్లోకి వస్తుందని కేటీఆర్‌ చెప్పినట్లు… ఎన్నారై ప్రతినిధులు తెలిపారు.